Monday, October 4, 2010

ananthapadmanabha vratam , అనంతపద్మనాభ వ్రతం



అనంత పద్మనాభ చతుర్దశి
భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కేవలం వ్రతమేకానీ ఉత్సవం మాత్రం కాదు. సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ఇది ప్రధానమైందని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో కూరుకొనిపోయి ఉన్నప్పుడు బయట పడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది. వనవాస కష్టాలను అనుభవిస్తున్న కాలంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అలా ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. ఎవరీ అనంతుడు, అనంతపద్మనాభస్వామి? అనే సందేహాలు ఈనాటి వారికొచ్చినట్టుగానే ఆనాడు ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఓ చక్కటి సమాధానం చెప్పాడు. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే ఎవరో తెలుసుకోగలిగాడు ధర్మరాజు.
వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. ఈ విషయాలన్నిటినీ పరిశీలించి చూస్తే అనంతపద్మనాభ వ్రతం తొలుత యమునా నది పరిసర ప్రాంతాలలో ఆవిర్భవించి ఆ తర్వాత దేశం అంతటా విస్తరిల్లి ఉంటుందన్నది పండితుల భావన. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.

ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.

వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు. అనంతపద్మనాభ వ్రతాన్ని ఎలా చేయాలి? తోరాన్ని ఎలా తీసుకోవాలి? పూజా ద్రవ్యాలు లాంటివి ఏమేమి వాడాలి అనే విషయాలన్నీ బాగా తెలిసిన పండితుడితో చెప్పించుకొని ఆయన సహాయంతో వ్రతాన్ని చేసుకొని పుణ్య ఫలాలను పొందాలంటున్నాయి వ్రత గ్రంథాలు.

వ్రతవిధానము :
ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.