Tuesday, July 13, 2010

Chaturmaasa vratamu , చాతుర్మాస వ్రతము





ఆషాడమాసము లో జరిపే " చాతుర్మాస వ్రతము " : - >
ఆషడ , శ్రావణ , భాద్రపద , ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాల కడలి మీద శయనిస్తాడు కావున ఈ నాలుగు నెలల్లో ఒక్కోనెల ఒక్కో పదార్ధాన్ని తినరు (వదలివేస్తారు ) దీనినే ' చాతుర్మాస ' వ్రతము అంటారు .
  • ఆషాడమాసము లో ... ఆకుకూరలు , (విరోచనాలు వాంతులు ఉన్న కాలము కావున ఆకుకూరలు తినకుండా ఉంటే మంచిది ),
  • శ్రావణ మాసములో ... పెరుగు (గాస్టిక్ ఎసిడిటీ పెరగకుండా ఉండడానికి-- ఈ కాలములో ఎసిడిటీ ప్రొబ్లంస్ ఎక్కువ కాబట్టి ),
  • భాద్రపద మాసము లో ... పాలు ( గొడ్లు ఎదకట్టే కాలము కావున ),
  • ఆశ్వీయుజ మాసము నుంచి కార్తీకము వరకు పప్పుదినుసులు వదిలేస్తారు.
ఈ నాలుగు నెలలు ఈ పదార్ధాలు తినరు . ఆశ్వీయుజ , కార్తీక మాసాలలో శాకవ్రతము చేస్తూ ఆకుకూరలు , కంద , చేమ.. తో చాలామంది భోజనం చేస్తారు . ఇవన్నీ అరోగ్యకరమైన సూత్రాలు .

Story in details:

విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించెను

ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస వ్రమతని చెప్పారు కదా... ఏ కారణం వల్ల దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి? విధానం ఏమిటి? అన్నీ వివరించమని కోరెను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పెను...

ఓ ధనలోభా వినుము... చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొనును. ఆ నాలుగు నెలలకే చాతుర్మాసమని పేరు. ఈ నాలుగు నెలల్లో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుకొంటిని కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేయుచున్నాను.

మొదట వైకుంఠమునందు గరుడగంధర్వులు, దేవతలు, వేదాలచే సేవింబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఉండగా నారదమహర్షి వచ్చి నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలు అయిన పిదప శ్రీహరి నారదమహర్షిని లోకమంతా ఎలా ఉందని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా! నీకు తెలియని విషయాలంటూ ఈ సృష్టిలో ఏమున్నాయి. అయినా నన్ను చెప్పమనడంలో నీ గొప్పదనం అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో సాధుపుంగవులు, మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. మరికొందరు భుజింపకూడదని పదార్థాలను భూజిస్తున్నారు. మరికొందరు పుణ్యవ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార పూరితులై పరులను నిందిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిస్తున్నారు. మరి వీరంతా ఎలా ముక్తి పొందుతారో నాకు తెలియడం లేదని మహర్షి ఆవేదన చెందుతాడు. వీరందరినీ ఉద్ధరించేందుకు తగిన మార్గం ఉపదేశించమని అర్ధిస్తాడు.

అందుకా జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కలవరపడి లక్ష్మీదేవితో పాటు, గరుడ, గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ లోకంలోని సకల జీవుల్ని పరిశీలిస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతుంటాడు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు. మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని వారు ఎదురుగానే తప్పుకుతిరిగేవారు, మరి కొందరు అసలు ఈయనవంకే చూసేవారు కాదు. వారందరినీ చూస్తూ ఈ మనుజులను ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తాడు శ్రీహరి. ఈ విధంగా ఆలోచిస్తూనే ఓ రోజు శ్రీహరి నిజరూపంలో లక్ష్మీదేవితో సహా సకల దేవతాగణంతోనూ కలిసి నైమిశారణ్యముకు వెడతాడు.

ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమాలకు వచ్చిన శ్రీహరిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, లక్ష్మీనారాయణలను పరిపరి విధాలుగా స్తోత్రాలు చేస్తారు.
ఈ విధంగా మునులందరూ కలిసి లక్ష్మీనారాయణులను స్తోత్రము చేసిన తదుపరి జ్ఞాన సిద్ధుడను మహాయోగి ఓ దీనబాంధవా! వేదవ్యాసుడని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రులుగా గలవాడివని, నిరాకారుడవని, సర్వజనులచే పూజింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వల్ల మేము మా ఆశ్రయములు, మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా మేమీ సంసారబంధం నుండి బయటపడే మార్గాన్ని నిర్ధేశించమని వేడుకొనెను. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం చేసుకోలేడు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలగుతుంది. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! మమ్ము కాపాడమని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా! నీ భక్తికి నేనెంతో సంతోషించితిని. నీకు ఇష్టమైన వరము కోరుకోమని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరమునుంచి విముక్తుడను కాలేక సతమతమవుతున్నాను కాబట్టి నీ పాద పద్మములపై నా ధ్యానముండునటుల అనుగ్రహించమని వేడుకొనెను.

అంతట శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధా! నీవు కోరిన విధంగానే వరమిచ్చితిని. అది కాక ఇంకొక వరం కోరుకోమనెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు మా బోటి వారే సంసారబంధమునుండి తప్పించుకోలేకపోతున్నతారు. మరి సామాన్యులను కూడా ఉద్దరింపమని కోరగా నారాయణుడు చిరునవ్వుతో భక్తా ఈలోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు పోవుటకు ఒక వ్రతమును సూచిస్తున్నాను. ఆ వ్రతమును అందరూ ఆచరించవచ్చును. జాగ్రత్తగా వినమనెను.

నేడు ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి నిద్ర లేస్తాను. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రతమని అంటారు. ఈ కాలంలో త్రిసంధ్యలలో చేసే పూజలు, వ్రతాలు నాకు ఎంతో ఇష్టం. ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ, ఇతరులచేత చేయిస్తారో వారంతా నా సన్నిధికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ దశమి నుండి కూరలు, శ్రావణ శుద్ధ దశమి నుంచి పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకు నేను ఇలా శయనింతునని తెలిపి శ్రీమన్నారాయణడు శ్రీమహాలక్ష్మితో పాలసముద్రమునకు వెళ్ళి శేషపానుపుపై పవళించెను.

ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించెను. ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ, పురుష బేధము లేదు. అందరూ చేయవచ్చుననెను. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళెనని తెలిపిరి.

  • -------=================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: