Saturday, February 13, 2010

శివరాత్రి-హరహరమహదేవ్ ,ShivaRaatri-Hara Hara Mahadaeva





హరహర మహాదేవ --==- చిమ్మపూడి శ్రీరామమూర్తి

పౌరాణిక వాఞ్మయంలో ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ... శివరాత్రినాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.

స్కాంద పురాణంలోని ఈశాన సంహితలో ఓ కథ ఉంది. బ్రహ్మ, విష్ణువులోసారి ఒకరి కంటే ఒకరు అధికులమన్న అహంతో పరస్పరం కలహించుకుని తీర్పు కోసం పరమ శివుణ్ని అర్థించారట. శివుడు వారి మధ్య మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేశాడు. దాని ఆద్యంతాలు తెలుసుకురమ్మని వారిరువురినీ పంపాడు. బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వచ్చాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునే యత్నంచేసి, తానూ భంగపడ్డాడు. ఇదే లింగోద్భవ కథనం.

గుణనిధి అనే ఓ దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రినాడు శివాలయంలో శివలింగం వెనుక దాగివుండి, కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జతచేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడిచినా ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహా పుణ్యకృత్య ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మించి, దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి, ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాధుడి కాశీఖండంలో ఉంది.

శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరాన ఇసుకతో శివలింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నదీపర్వదినానే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనీ కథనం వ్యాప్తిలో ఉంది.

'శివ' అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. 'శ' అంటే శివుడనీ, 'వ' అంటే 'శక్తి' అనీ శివ పదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటిజాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.

క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాన్ని రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడా గరళాన్ని గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. 'నిర్ణయ సింధు'లోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది.

మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్కనైనారు, అక్కమహాదేవి, బెజ్జమహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

రాముడికి 'పంచాక్షరి'ని ప్రబోధించి రామనామం జపించాడు సాంబశివుడు. రాముడు శివనామం జపించాడు. అందుకే 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే' అన్నారు. భగవంతుడు, భాగవతుడు తానేనన్న సనాతన ధర్మసూత్ర ప్రసూనం వెదజల్లే ఈ అద్వైత సుమగంధం సర్వులకు ఆఘ్రాణయోగ్యం. ఇది భక్తగణ భాగ్యం. శివభక్తులే నాకిష్టులని రాముడంటే, రామభక్తులే నాకిష్టులన్నాడు హరుడు. మంత్ర బీజాక్షరాలలో ప్రధమాక్షర బీజం 'ఓం'కారమే సదాశివుడు.

ఏటా అయిదు రకాలైన శివరాత్రులొస్తాయి. 1. నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధాన చేస్తారు. 2. పక్ష శివరాత్రి: ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3. మాస శివరాత్రి: ప్రతినెలా బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి: మాఘ బహుళ చతుర్దశినాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి. 5. యోగశివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం!



  • ==========================================================

Visit My Website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.