Monday, October 26, 2009

క్రిస్టమస్ , Christmas






క్రిస్టమస్

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం ఏసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానార్ధము కలపదము.
పూర్తీ వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి - > యేసు జనము


క్రిస్మస్‌ బహుమతి

రెండువేల సంవత్సరాల క్రితం సంగతి. ఒక అభాగ్యురాలు, సమాజ నిరాపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడింది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్ళు. పాపం చేసినవారిని రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం. ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహువు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్ళతో కొట్టబోతున్నవారు ఒక్కక్షణం ఆగారు. 'మీలో పాపం చేయనివారెవరు? పాపం చేయని వారు ఎవరైనా ఉంటే, ముందుగా వారే రాయి విసరండి' అన్నాడాయన. అంతా ఒక్కసారి వెనుతిరిగారు. వారి చేతుల్లోని రాళ్ళు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడించి ఆయన ముందు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.

పాపం చేసినవారికి శిక్ష విధించడం కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపంలేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈలోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాపపరిహారార్థం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్మస్‌.

యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి బాలయేసును దర్శించిన ముగ్గురు జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారము, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్‌ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయవిధేయతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్నతండ్రి హితోపదేశం విను, నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు- ఇవి క్రీస్తు పలికిన అమృతవాక్కులు. యేసు అనగా గ్రీకుభాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. సమస్త లోక ప్రజల ఆకలి తీర్చే జీవాహారం ఇచ్చే క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరిపేరు బెత్లహేమ్‌. ఆ మాటకు అర్థం- రొట్టెల గృహం.

యేసుక్రీస్తు తన శిష్యులకు ఒకసారి తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పారు. 'మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అప్పుడు ఆ గొర్రెలకాపరి సురక్షితంగా ఉన్న తొంభైతొమ్మిదింటినీ వదిలి, తప్పిపోయిన ఆ ఒక్కదాన్నీ వెదకడానికి వెళతాడు. ఎంత అలసినా, కాలం వృథా అయినా అతను గొర్రె దొరికే వరకూ వెదుకుతూనే ఉంటాడు. అది దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. దాన్ని భుజాల మీద పెట్టుకుని తీసుకువస్తాడు. తప్పిపోయి దొరికిన తన గొర్రె గురించి స్నేహితులకు ఆనందంగా చెబుతాడు...' అంటూ ఆయన బోధించారు. అలా తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శుభవర్తమానం అమాయకులైన గొర్రెల కాపరులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.

'నిన్ను వలే నీ పొరుగువాణ్ని ప్రేమించు' ఇది ఆయన చిన్నవాక్యంలో అందించిన అద్భుతమైన ఉపదేశం. 'దుర్మార్గులను, సన్మార్గులను; పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి' అని ఆయన చేసిన బోధన- అన్ని కాలాల్లో అందరూ అనుసరించదగ్గ ఆత్మసాధన. దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే... దానికి మార్గం- క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. 'సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది'- ఇదే క్రిస్మస్‌ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభసందేశం.


  • ===========================================
visit my website - > dr.Seshagirirao - MBBS

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.